నమస్తే శేరిలింగంపల్లి:పాఠశాల విద్యార్థులకు విద్యార్థి దశలోనే, భారత సైన్యం శక్తిసామర్థ్యాలు, ప్రతిభాపాటవాలు తెలియపరచి, వారికి ఇండియన్ ఆర్మీ పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా.. చందానగర్ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల యాజమాన్యం తమ 8-10 తరగతుల విద్యార్థులను 21న మెహి దీపట్నంలోని మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు సందర్శనకు తీసుకెళ్లింది. ఈ సందర్బంగా క్యాంప్ ఆఫీసర్స్ ప్రదీప్ చంద్ర, వినీత్ తదితరుల ప్రోత్సాహంతో, విద్యార్థులు రైఫిల్స్ వంటి ఆయుధాల గురించి, పోరాట పద్ధతుల గురించి తెలుసుకున్నారు. అక్కడి గ్రౌండ్లో జరిపిన అనేక గేమ్స్ లో పాల్గొని బహుమతులను సాధించారు. లంచ్ తర్వాత ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో, ప్రదీప్ చంద్ర విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. సంబంధిత వెబ్ సైట్ వివరాలను అందించారు. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులు ఎంతో సంతోషంగా పాల్గొని, భారత సైన్యంలో భాగం కావాలన్న తమ ఆశయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులు శోభ, షర్మిల, ప్రసాద్ లను పాఠశాల సెక్రటరీ రఘునందన్ రెడ్డి అభినందించారు.