- లైసెన్సులు, భద్రత ప్రమాణాలు తప్పక కలిగి ఉండాలి
- నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచన
- సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి: సినిమా థియేటర్లలో భద్రత ప్రమాణాలు పాటించాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని సినిమా థియేటర్ యజమానులు, ఆర్&బి, ఫైర్, ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్లతో, జిహెచ్‌ఎంసి, లా& ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితర స్టేక్ హోల్డర్స్ తో శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ టీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., డీసీపీ మాదాపూర్ శిల్పవల్లి, డీసీపీ బాలానగర్ సందీప్, డీసీపీ శంషాబాద్ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇందిర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. సినిమా థియేటర్ యజమానులు తప్పనిసరిగా వారి థియేటర్ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని, సరైన భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నామని, తప్పనిసరిగా నిబంధనల లైసెన్సులను వెంటనే రెన్యువల్ చేసుకోవాలన్నారు. సంబంధిత ఆర్&బి, ఫైర్, ఎలక్ట్రికల్, జిహెచ్‌ఎంసి శాఖల నుంచి లైసెన్సులు తీసుకునే ప్రొసీజర్స్ ను వివరించారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుండా థియేటర్లు నడిపే యాజమాన్యాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రద్దీగా ఉండే రోడ్లపై తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టైమ్-షెడ్యూల్ పాటించాలని, పలు జాగ్రతలు తీసుకోవాలని సినిమా థియేటర్ల యజమానులకు సూచించారు. విశాలవంతంగా పార్కింగ్ సౌకర్యం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., డీసీపీ ట్రాఫిక్ టీ శ్రీనివాస్ రావు, ఐపీఎస్., డీసీపీ మాదాపూర్ శిల్పవల్లి, డీసీపీ బాలానగర్ సందీప్, డీసీపీ శంషాబాద్ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇందిర, ఏసిపిలు, డిఎఫ్‌ఓ లు సుధాకర్ రావు, శ్రీధర్ రెడ్డి, పూర్ణచందర్, ఆర్&బి, ఫైర్ , ఎలక్ట్రికల్, జిహెచ్‌ఎంసి విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.