నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో గాజు పాత్ర ప్రమాదవశాత్తు జారి కింద పడిందని పనిమనిషిపై దాడి చేసి గాయపరిచిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్ పిచ్చిడిబాద్ కు చెందిన 18 సంవత్సరాల వయస్సు గల త్రిష అనే అమ్మాయిని విశాల్, అమృత భార్యభర్తలిద్దరూ ఇంట్లో పని కోసం ఫిబ్రవరి 17 వ తేదీన బీహార్ పాట్నాకు తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో గల ప్రశాంత్ నగర్ కాలనీ ఎలైట్ అపార్ట్ మెంట్ లోకి మార్చి 17 వ తేదీన వచ్చిన విశాల్ అమృత లు తమ పనిషి త్రిషను సైతం వారితో పాటే తీసుకువచ్చారు. వారి ఇద్దరు కవల పిల్లలను చూసుకోవడం, ఇంటి పని చేస్తూ ఉంటున్న త్రిషను చిన్న చిన్న తప్పులకు తరచూ భార్యభర్తలిద్దరూ ఎత్తిచూపుతూ అరుస్తూ బూతు మాటలు తిడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో మే 26వ తేదీన అర్థరాత్రి 12. 30 గంటలకు పని మనిషి త్రిష సామాన్లు కడుగుతుండగా ప్రమాదవశాత్తు గాజు కప్పు చేతిలో నుంచి కింద పడి పగిలిపోయింది. దీంతో ఆగ్రహించిన యజమాని అమృత గొడవ పెట్టుకుని అదే కప్పు తో పని మనిషి త్రిషను కొట్టడంతో కుడి కన్ను పై భాగాన రక్త గాయం అయ్యింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పని మనిషి త్రిష చేసిన ఫిర్యాదు మేరకు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.