నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజవర్గంలో చేపట్టిన ఎస్టీపీల నిర్మాణ పనులు, వాటి స్థితిగతులపై జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులతో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని, తాగు నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సివరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఎస్టీపీల నిర్మాణం పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. అదేవిధంగా ఎస్టీపీ నిర్మాణం పనులపై సలహాలు, సూచనలు చేశారు. 31మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏడు ఎస్టీపీలకు నిధులు మంజూరు చేసిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఆరెకపూడి గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం, సుందరీకరణ చేసి, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంజూరి అయిన ఏడు మురుగు నీటి శుద్ధి కేంద్రాల్లో మియాపూర్ పటేల్ చెరువు వద్ద 7 ఎంఎల్ డీ కెపాసిటీ గల ఎస్టీపీని రూ. 26.27 కోట్లతో గంగారాం పెద్ద చెరువు 20 ఎంఎల్ డీ ని రూ. 64.14 కోట్లతో, దుర్గం చెరువు 7 ఎంఎల్ డీ రూ. 25.67 కోట్లతో, ఖాజాగుడ చెరువు వద్ద 21 ఎంఎల్ డీ కెపాసిటీతో రూ. 61.25 కోట్లతో, అంబిర్ చెరువు వద్ద 37 ఎంఎల్ డీ కెపాసిటీతో రూ.100.87 కోట్లతో, ఎల్లమ్మ కుంట చెరువు వద్ద జయనగర్ 13.50 ఎంఎల్ డీ కెపాసిటీ ని రూ. 43.46 కోట్లతో, పరికి చెరువు 28 ఎంఎల్ డీ కెపాసిటీ తో రూ. 83.05 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జలమండలి అధికారులు జలమండలి ఎస్టీపీ విభాగం సీజీఎం పద్మజ, జీఎం వాస సత్యనారాయణ, డీజీఎం దీపాలి తదితరులు పాల్గొన్నారు.