- ప్రభుత్వ స్థలల్లో ఆక్రమణలను ఉపేక్షించం: ఆర్డీఓ చంద్రకళ, డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్
నమస్తే శేరిలింగంపల్లి: గోపన్‌పల్లి సర్వే నెంబర్ 37లో ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్‌పల్లి గ్రామ స.నెం. 37లోని ప్రభుత్వ స్థలంలో పలువురు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కాగా సదరు సర్వే నెంబర్‌లోని అత్యంత విలువైన స్థలాలలో వెలిసిన నివాసాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో ఉన్నతాధికారులు రెవెన్యూ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం కూల్చివేతల పర్వం మొదలయ్యింది.
రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వంశీమోహన్‌ల నేతృత్వంలో గోపన్‌పల్లి సర్వే నెంబర్ 37లోని నివాసాల కూల్చివేతకు దిగారు. సదరు సర్వేనెంబర్‌లోని ప్రభుత్వ స్థలంలో మొత్తం 208 నివాసాలను కూల్చివేస్తున్నట్టు వారు తెలిపారు. 8 రవెన్యూ బృందాలు, 8 పోలీసు బృందాల(500 మంది పోలీసు), 10 జేసీబీల సహకారంతో నిర్మాణాలను పూర్తిగా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకుంటునట్టు వారు తెలిపారు. ప్రభుత్వ స్థలలు ఆక్రమణకు గురవుతుంటే చూస్తు ఊరుకోమని అన్నారు. ప్రభుత్వ భూమిలో వెలిసిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
స్థానిక కార్పొరేటర్ అరెస్టు…
గోపన్‌పల్లి సర్వే నెంబర్ 37లోని నిర్మాణాల కూల్చివేత సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితులకు అండగా వెళ్లిన గంగాధర్‌రెడ్డి కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటు ఏర్పరచుకున్న స్థిర నివాసాలను, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అమానుషం అన్నారు. నిరుపేదల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.