- చర్చకు దారితీస్తున్న నల్లగండ్ల స.నెం.195, శేరిలింగంపల్లి 97 సరిహద్దు వివాదం
- గతంలో ప్రభుత్వ స్థలంమంటు నిర్మాణాలను కూల్చిన రెవెన్యూ యంత్రాంగం
- తాజాగా అదేస్థలంలో ప్రైవేట్ వ్యక్తుల పాగా… వడివడిగా ప్రహరీ నిర్మాణం…
నమస్తే శేరిలింగంపల్లి: సాధారణ జలమైనా దేవుడి ముందున్న శంఖంలోంచి పోస్తే పవిత్ర జలంగా, తీర్ధంగా పరిగణించబడుతుంది. అలాగే ఎదైనా కాగితంపై ఒక అధికారి సంతకం చేసి ముద్ర వేసినప్పుడు అది ప్రభుత్వ అధికారిక పత్రంగా, ఎంతో విలువను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు ఇచ్చిన ఓ రిపోర్టు కొందరు వ్యక్తులకు శస్త్రంగా మారిపోయింది. కోట్ల విలువ చేసే భూమి నిన్నటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఒక్కసారిగా ప్రైవేట్ పరం కావడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
నల్లగండ్ల స.నెం. 195గా గ్రూప్ 4 సెక్యూరిటీ గార్డుల ఇండ్ల నిర్మాణాలు…
నల్లగండ్ల గ్రామ సర్వేనెంబర్ 195లో 14.34 ఎకరాలలో ప్రభుత్వ స్థలం ఉంది. అందులో నేతాజీ నగర్ వీకర్ సెక్షన్ ఏర్పడగా, శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 97ను ఆనుకుని కొంత ఖాలీ స్థలం మిగిలి ఉంది. ఐతే 2013లో వందలాది మంది గ్రూప్ 4 సెక్యూరిటీ సిబ్బందితో ఏర్పాటైన ఐఎన్‌టీయూసీ యూనియన్ స.నెం. 195లో మిగిలి ఉన్న సదరు ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణాలకు పూనుకుంది. ఒక్కో సభ్యుడు 100 గజాల చొప్పున జూలై మొదటివారంలో తొలి విడతగా 12 మంది ఇండ్ల నిర్మాణాలను చేపట్టారు. ఐతే జూలై 9 తెల్లవారుజామున శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి సదరు నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ స్థలం నల్లగండ్ల సర్వేనెంబర్ 195 పరిధిలోకి వస్తుందని, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా నిర్మాణాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
శేరిలింగంపల్లి స.నెం.97గా ప్రైవేట్ వ్యక్తుల ప్రహరీ నిర్మాణం…
గతంలో నిర్మాణాలు కూల్చిన చోటే సదరు స్థలాన్ని తాజాగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు చదును చేశారు. దాంతో పాటు స్థలం చుట్టు యథేచ్ఛగా ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. ఇదేంటని స్థానికులు, నాటి బాధితులు ప్రశ్నించగా ఆ స్థలం తమదని, శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 97 పరిధిలోకి వస్తుందని పేర్కొంటున్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్స్ అధికారులు సర్వే చేసి ఆ స్థలం తమదిగా తేల్చారని అంటున్నారు. ఏడీ సర్వే రిపోర్టు ఆధారంగానే తమ స్థలం చుట్టు నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఐతే ఒకప్పుడు ప్రభుత్వ భూమిగా పేర్కొంటు నిరుపేదల నిర్మాణాలను నిర్ధాక్షణ్యంగా కూల్చివేసిన శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు నోరు మెదపక పోవడంపై నాటి బాధితులు, మండిపడుతున్నారు. నిరుపేదలకు ఒక న్యాయం, బడాబాబులకు మరో న్యాయమా అంటు ప్రశ్నిస్తున్నారు.
సాకతికంగా అన్ని ప్రమాణాలు పాటించి సర్వే చేశాం: ఏడీ శ్రీనివాస్
తాజా పరిస్థితులపై ‘నమస్తే శేరిలింగంపల్లి’ సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌ను వివరణ కోరగా సాకేంతికంగా డీజీపీఎస్(Differential Global Positioning System), గూగుల్, ధరణి భువన్ మ్యాప్‌లను ప్రామాణికంగా తీసుకుని, అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇటు అల్యూమీనియం ఇండస్ట్రీస్ ప్రహరీలను, మరోవైపు నల్లగండ్ల చెరువు, గుల్‌మోహర్ పార్కు హద్దులను పరిగణలోకి తీసుకుని సర్వే చేశామని. ఆ రిపోర్టు ఆధారంగానే హద్దులను ఫిక్స్ చేశామని అన్నారు. గతంలో అక్కడ నిర్మాణాలను కూల్చివేసిన విషయం తమ దృష్టిలో లేదని, ఆ అంశంపై పునఃపరిశీలీస్తామని అన్నారు. తాము తాజాగా సూచించిన హద్ధులకు విరుద్ధంగా ఎవరైన స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అటు.. ఇటుగా.. గుల్‌మోహర్ పార్క్ స్థలం
ఏడి సర్వే రిపోర్టు ప్రకారం రూపొందించిన మ్యాపుకు, ధరణిలోని భువన్ మ్యాప్‌కు పొంతన కుదరడం లేదు. భువన్ మ్యాప్‌లో గుల్‌మోహర్ కాలనీ పార్కు స్థలం పావు భాగం శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 97 వెలుపల కనిపిస్తుండగా, ఏడి సర్వే రిపోర్టులోని మ్యాప్ ప్రకారం పార్కు స్థలం మొత్తం 97లో అంతర్లీనంగా చూపిస్తుంది. దానికి తోడు కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది, స్థానిక పుర ప్రముఖులు గుల్‌మోహర్ కాలని పార్కులోని సగం స్థలం కంటే ఇవతలే శేరిలింగంపల్లి శివారు ముగిసిపోతుందని, పార్కు చివరి వరకు ఉండే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో ఈ అంశం స్థానికంగా చర్చకు దారితీసింది. ఐతే ఇక్కడ ఏడీ ఇచ్చిన సర్వే రిపోర్టును చాలెంజ్ చేసే స్థితిలో శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం లేక మిన్నకుండి పోవడంతో, సదరు స్థలంకు సంబంధించి నిజానిజాలు బయటకు వస్తాయా లేదా అనే అనుమానం నెలకొంది.
మా ఇండ్లను కూల్చారు… వారికేమో అండగ నిలుస్తున్నారు…
ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో ఇళ్లకు అద్దె చెల్లించలేక పోతున్నాం. అందుకే లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చుకుని 2013లో నల్లగండ్ల స.నెం.195లోని ప్రభుత్వ స్థలంలో సొంతంగా చిన్న ఇళ్లు కట్టుకున్నాం. మా గోడు అర్థం చేసుకోకుండా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మా ఇండ్లకు కూల్చివేశారు. ఇప్పుడేమో వేరే వారు గోడ కట్టుకుంటుంటే అండగ నిలుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి అదే స్థలంలో మాకు నిర్మాణాలను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
కే.నర్సింహా రావు,
2013 కూల్చివేతల బాధితుడు.
ఇది మా కంపెనీ స్థలం… గత నిర్మాణాలతో సంబంధం లేదు…
ది నెషనల్ కమర్షియల్ ఆండ్ ఫైనాన్సింగ్ కంపెనికి సంబంధించి మొత్తం 55 ఎకరాల స్థలం. ఇప్పటికే ఒకవైపు శ్మశానవాటిక, మరోవైపు పార్కులో మా స్థలం కబ్జాకు గురైంది. సుప్రిం కోర్డు ఆర్డర్‌ను పరిగణలోకి తీసుకుని ప్రస్థుతం 4.15 ఎకరాల భూమిలో మిగిలి ఉన్న ఖాళీ స్థలాన్ని పరిరక్షించుకుంటున్నాం. అందులో భాగంగానే ఏడీ సర్వే రిపోర్టు ఆధారంగా హద్దులను ఫిక్స్ చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాం. ప్రహరీ నిర్మాణం భాద్యతలను తాజాగా కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో గతంలో జరిగిన నిర్మాణాలతో మాకు సంబంధం లేదు.
సంతోష్ రెడ్డి, సైట్ మేనేజర్.