నమస్తే శేరిలింగంపల్లి: అత్యంత అరుదుగా జన్మించే జంట లేగదూడలకు జన్మనిచ్చింది ఓ ఆవు. సాధారణంగా ఆవు ఒక కాన్పులో ఒక్క దూడకు మాత్రమే జన్మనిస్తుంది. జన్యుపరమైన మార్పుల్లో భాగంగా చాలా అరుదుగా ఆవు కవల దూడలకు జన్మనిస్తుంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఒక ఆవుకు ఒక మగ ఒక ఆడ దూడలు జన్మించాయి. మియాపూర్ బొల్లారం రోడ్ లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం ప్రాంతానికి చెందిన కలిదిండి నర్సింహా రాజు కుటుంబీకులు దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చి మియాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే మియాపూర్ నుంచి బొల్లారం వెళ్లే రహదారి 4 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. అందులో రకరకాల మొక్కలతో పాటు ఆవులను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. వారి వద్ద ఉన్న ఆవులలో ఒకటైన Holstein Friesian (హెచ్ఎఫ్) జాతి ఆవు రెండు రోజుల క్రితం రెండు లేగదూడలకు జన్మనిచ్చింది. ఆవులు కవలలకు జన్మనివ్వడం అత్యంత అరుదు అని ప్రతీ 200 ఆవులలో ఒకటి ఇలా కవలలకు జన్మనిచ్చే అవకాశాలు ఉంటాయని వెటర్నరీ వైద్యులి తెలిపారు. జంట లేగదూడల్లో ఒకటి ఆడ, మరొకటి మగ ఉన్నాయి. లేగదూడ కవలల జననంపై నర్సింహరాజు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అరుదుగా జరిగే ఘటన తమ వ్యవసాయ క్షేత్రంలో జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
