భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలి – తహశీల్దార్ కు ఎంసీపీఐ(యూ) వినతి

నమస్తే శేరిలింగంపల్లి: భూకబ్జాదారులను శిక్షించి ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి తుకారాం నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎంసీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ వంశీ మోహన్ కు వినతిపత్రం అందజేశారు. తుకారాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను, చెరువులు కుంటలను అధికార పార్టీ అండదండలతో దర్జాగా కబ్జాలు చేస్తున్న భూ భకాసురులు అక్రమంగా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని, అన్యాక్రాంతం అయిన భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అన్నారు. నర్సంపేట లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యాపారం చేస్తుంటే అడ్డుకుని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పోరాడుతున్న ఎంసీపీఐ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన నర్సంపేట తహశీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేసి అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎంసీపీఐ ఆధ్వర్యంలో పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎఫ్ డి డబ్ల్యు రాష్ట్ర మహిళ కార్యదర్శి కుంభం సుకన్య, విమల, లక్ష్మి ప్రసాద్, ఎంసీపీఐ నాయకులు లక్ష్మణ్ , పల్లె మురళి, నగేష్ లు పాల్గొన్నారు‌.

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎంసీపీఐ‌(యూ) నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here