హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ లో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైదర్ నగర్ కార్పొరేటర్ జానకి రామ రాజు పిలుపునిచ్చారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ మెంబర్లు, నాయకులు, బస్తీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పని చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదర్ నగర్ డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు. 2017 సంవత్సరం నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్, డిగ్రీకి సమానమైన డిప్లొమా పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫాం 18)తో పాటు ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. దీనికి సంబందించిన CHECK LIST , FORM 18 కార్పొరేటర్ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను కార్పొరేటర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు జలవాయు విహార్ కాలనీలోని ప్లాట్ నం.349లో ఉన్న కార్పొరేటర్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.