నమస్తే శేరిలింగంపల్లి: మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ యువకుడు రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. మాదపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్టణంకు చెందిన బి.రవిప్రకాష్ 15 రోజుల క్రితం నగరానికి వలస వచ్చి డీజేగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా సోమవారం సాయంత్రం మద్యం సేవించిన రవిప్రకాష్ యమహా ఎంటీ 15 బీఎస్6 బైక్ నెంబర్ టీఎస్ 07 బిఎన్ టీఆర్ 8741పై కేపీహెచ్‌బీ నుంచి మాదాపూర్ అయ్యప్పసొసైటీ వైపు వస్తున్నాడు. ఐతే అదే సమయంలో మాదాపూర్ చందానాయక్ తండాకు చెందిన రత్నావత్ కవిత(29) హౌస్‌కీపింగ్ విధులు ముగించికుని ఇంటికి వెళ్లే క్రమంలో కార్వీ ఆఫీస్ ఎదుట రోడ్డు దాటుతుంది. మద్యం మత్తులో బైక్‌పై వేగంగా వస్తున్న రవిప్రకాష్ ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యింది.

కవితను స్థానిక పేస్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతు రాత్రి మృతి చెందింది. పోలీసులు రవిప్రకాష్‌కు బ్రీత్ అనలైజ్ పరీక్షలు చేయగా అతనికి 267 mg/100 ml రీడింగ్ వచ్చింది. దీంతో అతనిపై 304-II IPC, 184, 185(a) MV Act (Culpable Homicide Not Amounting to Murder) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి ప్రకాష్‌కు సైతం గాయాలవ్వడంతో చికిత్స పొందుతున్నాడు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎంత ప్రచారం చేసినా యువత అర్ధచేసుకోకపోవడం విచారకరమని ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఒకరు చేసిన తప్పుకు మరోకరు బలికావడం తరచూ చూస్తున్నామని, ఇప్పటికైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని సూచించారు.





