మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను కనబరిచి పురోగతి సాధించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భాగ్యనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.రవికుమార్ సహకారంతో 3కె, 5కె, 10కె రన్నింగ్ పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటి రాశిఖన్నా, సైబరాబాద్ అడిషనల్ డిసిపి లావణ్య , మొదటి కమర్షియల్ పైలెట్ అజ్మీర్ బాబిలు హాజరై జెండా ఊపి పోటీని ప్రారంభించారు.

అనంతరం ముగింపు కార్యక్రమానికి హాజరైన డికె.అరుణ, కపిల్ మిశ్రా, ఎమ్మెల్సీ రామచంద్రారావులు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డి కె.అరుణ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్త్రీ పురుషుల మధ్య లింగ సమానత్వం కనిపించడం లేదన్నారు. ప్రపంచానికి స్ర్తీయే ఆధారమని, ఆమెను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ పురుషుడిపై ఉందని తెలిపారు. అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ సందర్భంగా భాగ్యనగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు గంగల రాధా కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






