చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీ శంకరాలయ 21 వ వార్షిక శివోత్సవములు నాల్గవ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి అచార్యులు, శైవ ఆగమ వేద పండితులు సుబ్రహ్మణ్యం శర్మ బృందం పర్యవేక్షణలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా మహా సహస్ర లింగాభిషేకం, నిత్య హోమం, జ్యోతిర్లింగార్చన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం భూతవాహన సేవలో భాగంగా చందానగర్ పురవీధుల్లో శ్రీ భవానీ శంకరులు ఊరేగారు. దారిపొడవునా భక్తులు స్వాగతం పలుకుతు స్వామివార్లను దర్శించుకున్నారు.