నమస్తే శేరిలింగంపల్లి: బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరచిన రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి తిరుమల వేముల మంగళవారం శేరిలింగంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మియాపూర్ ఎంఏనగర్‌లోని ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకలే లక్షంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల పాలన రాజ్యమేలుతుందని మండిపడ్డారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో దోపిడి రాజ్యం కొనసాగుతుందని అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అధికార పక్షం వాగ్ధానాలు చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారిందని, ఇప్పటికైన విద్యావంతులు ఆలోచించి ఓటుతో కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ మాట్లాడుతూ పెద్దల, చట్ట సభలలో బహుజనుల గొంతు వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ క్రమంలోనే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి తిరుమల వేములకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు వనం సుధాకర్, కుంభం సుకన్య, తుకారం నాయక్, హరినాథ్ గౌడ్, మైదంశెట్టి రమేష్, పల్లే మురళీ, భాగ్యమ్మ, మధుసుదన్, కన్నశ్రీనివాస్, లావణ్య, సుల్తాన, లక్ష్మీ, విమల, వేముల లక్ష్మన్, ఆకుల రమేష్, ఇందిర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.





