సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: న‌డిగ‌డ్డ తండా వాసులు

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌కు ఫిర్యాదు
  • స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్న గాంధీ

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): త‌మ తండా వాసుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ త‌మ‌పై దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్న‌ సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ బుధ‌వారం మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని న‌డిగ‌డ్డ తండా వాసులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. తండా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయ‌కులు స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర‌స‌న చేప‌ట్టారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న న‌డిగ‌డ్డ తండా వాసులు

ఈ సంద‌ర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తాము గ‌త 50 సంవ‌త్స‌రాల నుంచి తండాలో ఇళ్ల‌ను నిర్మించుకుని నివాసం ఉంటున్నామ‌ని అన్నారు. త‌మ ఇళ్ల‌కు తాగునీటి క‌నెక్ష‌న్లు, విద్యుత్ క‌నెక్ష‌న్లు ఉన్నాయ‌న్నారు. కాగా 2016 లో తండా స‌మీపంలో సీఆర్‌పీఎఫ్ వారు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశార‌ని, అప్ప‌టి నుంచి వారు త‌మ తండా వాసుల‌ను అన్ని ర‌కాలుగా వేధింపుల‌కు గురి చేస్తూ భ‌య భ్రాంతుల‌కు లోను చేస్తున్నార‌ని అన్నారు. త‌మ‌ను వారు అసాంఘిట శ‌క్తులుగా భావిస్తూ అర్థ‌రాత్రి వేళ ఆయుధాల‌తో తిరుగుతున్నార‌ని, త‌మ ఇళ్ల‌లోకి చొర‌బ‌డుతున్నార‌ని, త‌మపై భౌతిక దాడులు చేస్తున్నార‌ని అన్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, క‌నుక వెంట‌నే త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సంఘం అధ్య‌క్షుడు ద‌శ‌ర‌థ్ నాయ‌క్‌, నాయ‌కులు తిరుపతి నాయక్, శంకర్ నాయక్, తుకారం నాయక్, హనుమంతు నాయక్, మధు ముదిరాజ్, సీతారాం నాయక్, చందు మోహన్, కృష్ణ, చాందీ బాయ్ పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీకి ఫిర్యాదు…
మియాపూర్ డీవిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్, నడిగడ్డ తండా కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ‌పై సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును వారికి వివ‌రించారు. త‌మ గుడిసెల‌ను సీఆర్‌పీఎఫ్ పోలీసులు తీసువేస్తున్నార‌ని, ఎన్నో ఏళ్ల నుండి నివాసం ఉంటున్న త‌మ‌ను ఇప్పుడు వెళ్ల‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని, క‌నుక ఈ విష‌య‌మై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు గాంధీ, శ్రీ‌కాంత్‌ల‌ను కోరారు. ఇందుకు గాంధీ సానుకూలంగా స్పందించారు. త్వ‌ర‌లోనే అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ శ్రీ‌కాంత్‌ల‌కు గోడు వెళ్ల‌బోసుకుంటున్న న‌డిగ‌డ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ న‌గ‌ర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here