గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

టోలిచౌకిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలో నివాసం ఉండే షేక్ సల్మాన్ (25) మణికొండలో టైలరింగ్ షాపును నిర్వహిస్తూ భార్య ఫరహీన్‌తో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఫరహీన్‌ను సల్మాన్ తరచూ వేధించేవాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న అతను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. దీంతో ఆమె తన పుట్టింటి వారికి విషయం చెప్పగా వారు వచ్చి ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయినప్పటికీ సల్మాన్ అక్కడికి కూడా వెళ్లి ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలోనే ఆమెకు ఆడ శిశువు జన్మించగా తనకు ఆ బిడ్డ పుట్టలేదని, వేరే ఎవరితోనైనా ఆమె ఆ శిశువును కని ఉంటుందని సల్మాన్ అవమానించాడు. దీంతో పగ పెంచుకున్న ఫరహీన్ కుటుంబ సభ్యులు సల్మాన్‌ను హత్య చేసేందుకు పథకం రచించారు.
కాగా ఫరహీన్, తన తండ్రి జిలానీ, తల్లి ఫర్జానా బేగంలు సల్మాన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే ఫర్జానా తన సోదరి కుమారులైన దస్తగిరి, మహబూబ్, షాబుద్దీన్ లకు విషయం చెప్పగా వారు అందరూ కలిసి షేక్ సల్మాన్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జనవరి 29వ తేదీన రాత్రి 10.30 గంటలకు సల్మాన్‌ను మణికొండలోని అతని టైలర్ షాప్ దగ్గర ఒక క్వాలిస్ వాహనం (AP12L9823) లో కిడ్నాప్ చేసి ఆ కారులోనే అతని మెడ చుట్టూ క్లచ్ వైర్ చుట్టి గట్టిగా లాగారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం అతన్ని మొయినాబాద్ పరిధిలోని నక్కలపల్లి చెరువు దగ్గరికి తీసుకెళ్లి వీపులో కత్తితో పొడిచి తలపై బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు. కాగా ఈ కేసులో జనవరి 31వ తేదీన దస్తగిరిని పోలీసులు అరెస్టు చేయగా, మంగళవారం జిలానీ, మహబూబ్, షాబుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.





