- రేసులో తాజా మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడి సతీమణి మంజుల రఘునాథ్ రెడ్డి లు
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల దృష్టి అంతా ప్రస్తుతం చందానగర్ డివిజన్ పై ఉంది. ఈ ప్రాంతం నుండి అధికార టిఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో ఎవరు నిలబడతారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధిష్టానం విడుదల చేసిన రెండు జాబితాలలోనూ చందానగర్ డివిజన్ అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం తో చివరిగా బరిలో నిలిచేదెవరో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డివిజన్ నుండి గత ఎన్నికల్లో గెలిచి ప్రాతినిధ్యం వహించిన బొబ్బ నవతా రెడ్డి పోటీలో ఉండగా, డివిజన్ నుండి టికెట్ ఆశించిన ఆశావహుల ఉమ్మడి అభ్యర్థి గా డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి సతీమణి మంజుల రఘునాథ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం టికెట్ కోసం వీరిరువురు ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం.

కాగా ఇరు వర్గాల నాయకులూ టికెట్ తమకు అంటే తమకే అనే ధీమాలో ఉన్నారు. పార్టీ అధిష్టానం సైతం టికెట్ ఎవరికీ కేటాయించాలనే అయోమయంలో ఉన్నట్లు సమాచారం. ఒకవైపు నవతా రెడ్డి డివిజన్ ప్రజలకు సుపరిచితురాలు కాగా, మరోవైపు ఆశావహులంతా ఒకే తాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిగా మంజుల రఘునాథ్ రెడ్డిని ప్రతిపాదించడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. దీంతో అధిష్టానం సైతం అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. టికెట్ ఎవరికీ కేటాయించినా ఇరు పక్షాలను సమన్వయము చేసి ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది.





