
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల ముందు హైదరాబాద్ నగర వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని టిఆర్ఎస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. శనివారం శేరిలింగంపల్లి బిజెపి ఆధ్వర్యంలో హఫీజ్ పేట డివిజన్ లో జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు కట్టించే వరకూ ఎన్నికల్లో ఓట్లు అడగనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక వాగ్దానాలను గాలికొదిలారన్నారు.

గ్రేటర్ లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించిన దాఖలాలు లేవన్నారు. పేదలకు ఇండ్ల విషయంలో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చొరవలో కొంతైనా కేసీఆర్ దృష్టి పెట్టడం లేదన్నారు. హామీలను నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. నగరంలో చెరువులు కుంటలు కబ్జాలకు గురయ్యి ప్రతీయేడు లోతట్టు ప్రాంతాలు ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురించిందని, అధికార పార్టీ నేతల అండదండలతోనే ఆక్రమణలు పెరిగి పోతున్నాయని విమర్శించారు. గ్రేటర్ వాసులు గులాబీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని, కారుకు ఓటు వేస్తే మజ్లీస్ పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గ్రేటర్ లో మాత్రమే వరద సహాయం పేరిట పదివేల రూపాయలను అందించారని, అధికారులు చేయాల్సిన పనిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్టాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని బిజెపిని గ్రేటర్ ప్రజలు గెలిపించి, టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి టిడిపి సీనియర్ నాయకుడు యేశం శ్రీశైలం యాదవ్, కురుమ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు శుర్ణ శ్రీశైలం కురుమలతో పాటు పలు పార్టీల నాయకులు బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు కిషన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు సామ రంగా రెడ్డి, అసెంబ్లీ కన్వినర్ బుచ్చిరెడ్డి, శేరిలింగంపల్లి ఇంచార్జీ యోగానంద్, బిజెపి సీనియర్ నాయకులు భీంరావు, మొవ్వా సత్యనారాయణ, నరేష్, కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముల్లగూరు జ్ఞానేంద్రప్రసాద్, రవింద్రప్రసాద్ దూబే, నాగులు గౌడ్, ప్రభాకర్ యాదవ్, వసంత కుమార్, మైపాల్ రెడ్డి. బోయిన మహేశ్ యాదవ్, బిజెవైఎం అసెంబ్లీ కన్వినర్ జితేంధర్, నాయకులు మనోహర్, విజయలక్ష్మీ, వినయమ్మ, నరేంధర్ రెడ్డి, విష్ణు, నర్సింగ్ రావు, కమాలకర్ రెడ్డి, శ్రీధర్ రావు. బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





