శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శారదా హైస్కూల్ లో సరోజినీ నాయుడు జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెట్ బందా నరేంద్ర బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సరోజినీ నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యిణి దేవారెడ్డి విజయలక్ష్మి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సరోజినీ నాయుడు కులమతాతీత భావనలతో ప్రజలు పెరగాలని అపుడే సమసమాజ స్థాపన సాధ్యమని నమ్మిన వనిత అని అన్నారు. అనంతరం స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని గాంధీ ప్రియశిష్యురాలిగా మారారని తెలిపారు. దేశమంతటా ఊరు, వాడా తిరిగి ప్రజలలో ప్రేరణ కలిగించి దేశభక్తిని పెంపొందించారని అన్నారు. నేటి మహిళా నాయకులు ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలు ఇంటా, బయటా రక్షణకు, హక్కులకు, సంపూర్ణ సాధికారతకు కృషి చేయడమే మనం ఆవిడకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు శేషుబాబు, విద్యార్థిని, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, వాణీ సాంబశివరావు, శివరామిరెడ్డి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






