అతి సూక్ష్మంగా ఉండే వైరస్ లలో మ్యుటేషన్లు (మార్పులు) చాల వేగంగా జరుగుతూ ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా వైరస్ లు మార్పులు చేసుకుంటూ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిద్) వైరస్ లో సైతం పలు మార్పులు జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భారతదేశంలో వ్యాపిస్తున్న వైరస్ లో పెద్దగా మార్పులు లేనప్పటికీ బ్రిటన్ లో రెండవ రకం వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా వైరస్ ఉపరితలం పై ఉన్న స్పోక్స్ ప్రొటీన్లలో మార్పులు జరిగాయని, మొదటి వైరస్ తో పోల్చితే ఈ స్పోక్స్ కు కణాలను అతికి పెట్టుకునే సామర్ధ్యం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో పాటు ఈ వైరస్ సోకినా వ్యక్తిలో లక్షణాలు సైతం వేరుగా ఉన్నట్లు గుర్తించారు.
కొత్త కోవిడ్ వైరస్ సోకితే కనిపించే లక్షణాలు…
బ్రిటన్ లో కనుగొన్న కొత్త వైరస్ సోకినప్పుడు కలిగే లక్షణాలపై ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటన విడుదల చేసింది. తీవ్రమైన అలసట, ఆకలి లేకపోవడం, విపరీతమైన తలనొప్పి, గందరగోళంగా అనిపించించడం, కండరాల నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు రెండవ రకం వైరస్ లను సైతం తట్టుకోగలవాని శాస్త్రవేత్తలు తెలియజేశారు. కోవిద్ నివారణకు ముందు నుండి పాటించిన జాగ్రత్తలు తూచ తప్పకుండా పాటిస్తే వైరస్ బారిన పడకుండా ఉండగలమని వైద్యులు తెలుపుతున్నారు.