మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు చేస్తున్న ముగ్గుర్ని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఘన, ద్రవ రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేపీహెచ్‌బీలోని అడ్డగుట్ట సమతా నగర్ వెస్టర్న్‌హిల్స్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గంజాయి అమ్ముతున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన విద్యార్థి కె.జయకృష్ణా రెడ్డి (24), ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థి జనావత్ బలరాం నాయక్ (23), అదే ప్రాంతానికి చెందిన సెగు వెంకట శ్రీకార్ (23)లుగా గుర్తించారు.
కాగా వారు ముగ్గురూ కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నారు. జయకృష్ణా రెడ్డి జేఎన్‌టీయూలో విద్యనభ్యసిస్తున్నాడు. అతను ఏపీలోని వైజాగ్ నుంచి గంజాయిని తెచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్మడం ప్రారంభించాడు. దీంతో పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయని ఆశ పడ్డాడు. అతనికి మిగిలిన ఇద్దరూ సహకరించారు. ఈ క్రమంలో వారి నుంచి పోలీసులు 8 కేజీ ఘన రూపంలో ఉన్న గంజాయిని, 900 గ్రాముల ద్రవ రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సదరు గంజాయిని వారు 2కేజీలు, 1కేజీ, 500 గ్రాములు, 100 గ్రాములు, 50 గ్రాముల ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్యాకెట్లతోపాటు వారి నుంచి 3 మొబైల్ ఫోన్లను కూడా ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం వారిని ఎస్‌వోటీ పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.