- శానిటేషన్ విభాగంపై సమీక్ష సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి : స్వచ్ఛ పరిసరాలు, వ్యర్థాల నిర్వహణ, ఇంటి వద్దే చెత్త విభజన.. సహా ఇతర అన్ని అంశాలలో ఐటీ పరిశ్రమలకు వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్ ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకునేందుకు సమన్వయంతో కృషి చేయాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి సూచించారు. ఆయా విభాగాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని, తద్వారా సులువుగా లక్ష్యాన్ని చేరుకోవచ్చునన్నారు. జోన్ పరిధిలోని శానిటేషన్ నిర్వహణపై జోనల్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్ వ్యాప్తంగా వాణిజ్య ప్రాంతాలలో చెత్త సేకరణ వంద శాతం అత్యంత పకడ్బందీగా జరగాలన్నారు. ఇండ్ల వద్దే తడి పొడి చెత్త వంద శాతం సేకరణ జరగాలని, ఆ మేరకు స్వఛ్ ఆటోలు సైతం అదే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని, ఆ ప్రాంతాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
నిర్మాణ వ్యర్థాల సేకరణపై శ్రద్ధ వహించాలని, అనధికారికంగా రహదారుల పక్కన డంప్ చేసే వారిని ఉపేక్షించవద్దని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపుకు పూర్తి స్థాయిలో వాహన సన్నద్ధత ఉండేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. స్వఛ్ ఆటోల పనితీరు మరింత మెరుగపడాలని, అధికారులు క్షేత్రస్థాయిలో తగు పర్యవేక్షణ చేపట్టాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాలుగు సర్కిళ్ల డీసీలు రజనీకాంత్‌రెడ్డి, వంశీకృష్ణ, సురేష్, నాయక్, వైద్యాధికారులు, పీవోలు, ఎస్ఎస్లు, ఎస్ఆర్‌పీలు పాల్గొన్నారు.