- అధికారులు పట్టించుకోరు.. సమస్య తీరదు
- సమస్య నెలకొన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చిత్రపటం ఏర్పాటు
నమస్తే శేరిలింగంపల్లి: రోడ్ల పై వరద.. కాలనీలు, బస్తీల్లో బురద.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి. మరోవైపు పేరుకుపోయిన చెత్త..దాన్నుంచి వెలువడుతున్న దుర్వాసన.. అనారోగ్యాల బారిన జనం..
సమస్యలపై స్పందించని సంబంధిత అధికారగణం.. ఇదా ప్రజలు మెచ్చిన ప్రభుత్వ ప్రజా పాలన అంటూ స్థానికంగా పలువురు ప్రభుత్వం పై ప్రశ్నల విల్లు వదులుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షానికి వాన నీరు రోడ్డుపై నిలిచి దుర్వాసన వస్తున్నది, దోమలు కునుకులేకుండా చేస్తున్నాయి, అధికారులు పట్టించుకోవడం లేదు తమ గోడు పట్టించుకునే వారే లేరా అంటూ స్థానికులు విలవిల లాడుతున్నారు. మాకెవరు లేరు.. నువ్వే మాకు దిక్కు (“రేవంత్ అన్నా కంపు భరించలేక పోతున్నాం కాపాడు”, “అన్నా ఈ రోగాల నుంచి రక్షించు రేవంత్ అన్నా” అంటూ) అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చిత్రపటాన్ని సమస్య నెలకొన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సమస్యపై ఎవరు స్పందించకపోవడంతో ఇలా స్థానికులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.