- రాష్ట్ర సగర సంఘం తీర్మానం
నమస్తే శేరిలింగంపల్లి : శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లోని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ సంఘం కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగింది. ఎన్నికల కోడ్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించని కారణంగా శ్రీ శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ కమిటీలు మొదలుకొని జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కార్యవర్గ సమావేశం అన్ని జిల్లాలకు పిలుపునిచ్చింది.
భగీరథ జయంతి ఉత్సవాలతో పాటు పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సగర విద్యార్థులకు ప్రోత్సాహకంగా ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించాలని సంఘం నిర్ణయం తీసుకుంది. ఈనెల 17వ తేదీన భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు భాగ్యనగరం నుంచి పాదయాత్రగా వెళ్లి భద్రాచలం కళ్యాణం ఉత్సవానికి అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులను కార్యవర్గం సన్మానం చేసింది. భవిష్యత్తులో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవానికి సగరులే ప్రతి ఏటా పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించడంతోపాటు యువజన సంఘం, మహిళా సంఘం పూర్తి కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని, కాల పరిమితి పూర్తయిన జిల్లాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సంఘం తీర్మానం చేసింది. తెలంగాణ సగర ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర సంఘం స్వాగతించింది.
కోకాపేటలోని రెండు ఎకరాల ప్రభుత్వం అందజేసిన భూమిలో ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన ఎలాంటి చర్యలు ట్రస్టు తీసుకున్నా ఆ ట్రస్టు నిర్ణయాలను రాష్ట్ర సంఘం ఆమోదిస్తున్నట్లు కార్యవర్గం వెల్లడించింది. ఇతర అనేక అంశాలపై చర్చ జరిపిన రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు ప్రణాళిక రూపొందించింది. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇతర ఏ కులాలు చేపట్టని విధంగా చేపట్టిన జనగణన కార్యక్రమం మధ్యలో నిలిచిపోయిందని, తిరిగి అన్ని జిల్లాల సహకారంతో ప్రారంభించి పూర్తి చేయాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, ముఖ్య సలహాదారులు ఆర్. బి. ఆంజనేయులు సగర, సలహాదారులు కె.పి రామ్ సగర, రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమార స్వామి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మహిళా సంఘం అధ్యక్షులు స్రవంతి సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర, ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర, కోశాధికారి సందుపట్ల సాయి గణేష్ సగర పాల్గొన్నారు.