న్యూఢిల్లీ (నమస్తే శేరిలింగంపల్లి): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మార్చి నెలలో లాక్ డౌన్‌ను మొదట అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ అనేక సార్లు దేశ ప్రజలకు ధైర్యం చెబుతూ వచ్చారు. కరోనాను పారద్రోలేందుకు ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర ప్యాకేజీని ప్రకటించారు. అయితే ఇవాళ సాయంత్రం 6 గంటలకు మోదీ ఏ విషయంపై మాట్లాడుతారోనని సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేశారు. దేశంలో మూడు కరోనా టీకాలు ప్రయోగ దశలో ఉన్నట్లు వివరించారు. అయితే కరోనా టీకాల ట్రయల్స్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వాటిపైనే మోదీ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా టీకా పంపిణీపై బ్లూ ప్రింట్ సిద్ధం చేసి ఉంచింది. అందువల్ల టీకాపైనే మోదీ ప్రసంగిస్తారని తెలుస్తోంది. అయితే ఆయన ఏం మాట్లాడుతారు అనేది తెలియాలంటే.. సాయంత్రం 6 గంటల వరకు వేచి చూడక తప్పదు.