కెపిహెచ్‌బి(నమస్తే శేరిలింగంపల్లి): భవన నిర్మాణదారులను నిబంధనల పేరుతో బెదిరస్తూ వారి వద్ద నుండి పెద్దమొత్తంలో డబ్బు దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, ఎసిపి సురేందర్‌రావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కెపిహెచ్‌బి కాలనీ, సమతానగర్ లోని అడ్డగుట్ట సొసైటీలో నివాసముండే కుంచం బసంత్‌రాజా(42) హ్యూమన్ రైట్స్, యానిమల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ సెల్ సభ్యుడిగా చెలామణి అవుతూ తన పేరుపై లెటర్ హెడ్‌లు తయారు చేసుకున్నాడు. స్థానికంగా భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లకు నిబంధనలు అతిక్రమించారంటూ తన లెటర్ హెడ్ పై నోటీసులు జారీ చేసి తనకు పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులు చేయసాగాడు.
తనకు లొంగని వారిపై జిహెచ్ఎంసి పబ్లిక్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలోనే ఓ భవనం విషయంలో న్యాయస్థానంలో వ్యాజ్యం సైతం దాఖలు చేశాడు. ఈ పనులకు స్థానిక రాజయకీయ పార్టీలకు చెందిన గోపాల్‌రావు, కొడాలి రవి, వెంకటేశం, భద్రంలతో పాటు పలువురు మీడియా ప్రతినిధులను మధ్యవర్తులుగా ఉపయోగించుకున్నాడు. స్థానిక మాజీ కార్పొరేటర్ జానకీ రామరాజును సైతం పలు అక్రమ లావాదేవీల్లో భాగస్వామ్యం చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన పలువురు బిల్డర్లు బసంత్ రాజా కు పెద్దమొత్తంలో డబ్బును సమర్పించుకున్నారు. దాదాపు 50-60 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే గుడిపుడి వీరయ్యబాబు వద్ద రూ.8 లక్షలు, పుట్లూరి శ్రీధర్ వద్ద రూ.2 లక్షలు, డొక్కల పడమటయ్య వద్ద రూ.1.5 లక్షలు, బచ్చు అవినాష్ వద్ద రూ.75 వేలు, కుంచాల శ్రీను వద్ద రూ.5 లక్షలు, బొడ్డుకూరి వీరయ్య స్వామి వద్ద రూ.20-30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. వీరి వేధింపులు తాళలేక గుడిపూడి వీరయ్యబాబు ఈ నెల 8వ తేదీన కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం బసంత్‌రాజాతో పాటు నేరంలో అతనికి సహకరించిన పువ్వుల భార్గవ్ కిరణ్(24)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.