శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియెజకవర్గం తెరాస సీనియర్ నాయకుడు కలివేముల వీరేశం గౌడ్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఆరవింద్లపై ఫైర్ అయ్యారు. గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎప్పటికీ ఎగురవేయలేరని అన్నారు. ఆ కోటపై ముమ్మాటికీ జాతికి చిహ్నం మన జాతీయ ఐక్యతను చాటే జెండా మన త్రివర్ణ పతాకం ఎగురుతుందన్నారు. అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఎగురుతుందన్నారు. ధర్మపురి ఆరవింద్ నిజామాబాద్ రైతులకు ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని ఎంపీగా గెలిచారని, ఇంతవరకు ఆ ఊసే లేదని ఎద్దేవా చేశారు. అరవింద్ మాటల దురుసు ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం తప్పదన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో వందకుపైగా సీట్లను గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రీరామరక్షగా ఉంటుదని కలివేముల వీరేశం గౌడ్ అన్నారు.