శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మన హాస్పిటల్స్ గత తొమ్మిదేళ్లుగా విశేష సేవలందిస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి యాజమాన్యం నిరుపేదల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఖర్చుల్లో రాయితీలు కల్పిస్తూ సేవాభావంతో వైద్యం అందిస్తోంది.

ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన హాస్పిటల్స్‌ను పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న మన హాస్పిటల్స్ యాజమాన్యం సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. నిరుపేదల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని వైద్య ఖర్చుల్లో రాయితీలు కల్పించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వైద్యరంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మన హాస్పిటల్స్ చైర్మన్లు రామకృష్ణారెడ్డి, శశికాంత్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిలో గైనకాలజిస్టులుగా డాక్టర్ సి. సౌజన్య, డాక్టర్ నల్లపాటి సౌజన్య, డాక్టర్ నిక్కు హర్షిణి, చిన్నపిల్లల వైద్య నిపుణులుగా డాక్టర్ వి. మాధవీలత, డాక్టర్ ఆర్.వి. మాధవి వైద్య సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా వైద్యులందరికీ ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.





