శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్థికంగా వెనుకబడిన మహిళలను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అండాల సేకరణ ప్రక్రియ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మదీనగూడలోని ఓయాసిస్ అండ్ సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రంలో బ్రోకర్ల సహాయంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి అండాల సేకరణ ప్రక్రియ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గేదెల సూర్యకిరణ్, గేదెల దుర్గారావు, గేదెల గాయత్రి అనే నిందితులు మధ్యవర్తుల సహాయంతో ఆర్థికంగా వెనుకబడిన మహిళలను సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అండాల సేకరణ ప్రక్రియకు రూ.50 వేల వరకు చెల్లిస్తామని ఆశ చూపించి, మహిళలకు ప్రయాణం, వసతి సౌకర్యాలు కల్పిస్తూ హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అదేవిధంగా ఒక్కో మహిళను ఏర్పాటు చేసినందుకు మధ్యవర్తులకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలకు చెల్లించిన మొత్తాన్ని మినహాయించి మిగిలిన డబ్బును కమీషన్లు, ఇతర ఖర్చుల రూపంలో పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సేకరించిన అండాల సంఖ్య, నాణ్యత ఆధారంగా కూడా చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో భాగంగా ఎ-7 నిందితురాలు గేదెల గాయత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త హనుమంత్ కాళీ ప్రసాద్ బాబు (31). మియాపూర్ మదీనాగూడలోని ఓయాసిస్ ఫెర్టిలిటీలో ఎంబ్రియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆమె బండ్లగూడ జాగీర్‌లోని కాళీమందిర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ వ్యవహారంపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1608/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 125, 143(2), 143(3), 271, 272, 318(4), 61(2), 111తో పాటు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021లోని సెక్షన్లు 33(2), 34 కింద కేసు నమోదు చేశారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్, కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో మియాపూర్ పోలీసు బృందం ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తోంది.





