అన్నమయ్య సంకీర్తనలకు వీణానాదం.. కీర్తివాసిని సంగీత ప్రదర్శనతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్య సంకీర్తనలను సంగీత రూపంలో ఆలపిస్తూ భక్తులను అలరించే కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో శనివారం అన్నమయ్యపురంలో వారాంతపు అన్నదానం-అన్నమ స్వరార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి పారాయణం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు కీర్తివాసిని వీణపై అద్భుతమైన సంగీత ప్రదర్శన అందించారు. జతిస్వరం, చక్కని తల్లికి, భావమొకటే, తిరు తిరు జవరాల, జగడపు చనవుల, శ్రీమన్నారాయణ, భాగ్యద లక్ష్మీ బారమ్మ, భో శంభో, కాలభైరవాష్టకం, అయిగిరి నందిని తదితర గీతాలను వీణానాదంతో ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సంగీత ప్రదర్శనకు మృదంగంపై అనీష్ సహకారం అందించారు. సాయంత్రం 7 గంటలకు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అన్నమాచార్య సంకీర్తనల భావార్థాన్ని వివరించి, వాటిలోని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని భక్తులకు తెలియజేశారు. అనంతరం స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేయడంతో కార్యక్రమం ముగిసింది. అన్నమయ్య సంకీర్తనలను సంగీతం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని సేవలను భక్తులు అభినందించారు. వీణానాదం, సంకీర్తనలతో అన్నమయ్యపురం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here