శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెల్లాపూర్-నల్లగండ్ల రహదారిపై డ్రైనేజీ పనుల నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో తెల్లాపూర్ ఎస్‌బీఐ వద్ద నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో, ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి ఎంఎం వైన్ మార్ట్ వరకు ఆర్‌సీసీ పైప్‌లైన్‌తో కూడిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను చేపట్టాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ పనులను సజావుగా నిర్వహించేందుకు తెల్లాపూర్ ఎస్‌బీఐ వద్ద ఒక వైపు రహదారిని మూసివేసి వాహనాలను అందుబాటులో ఉన్న మరో వైపు రహదారిపైకి మళ్లించనున్నారు. ఆగస్టు 22 నుంచి ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ తెల్లాపూర్ యూటర్న్ నుంచి ఎంఎం వైన్స్ యూటర్న్ వరకు సుమారు 300 మీటర్ల మేర వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపించనున్నారు.
నల్లగండ్ల సర్కిల్ నుంచి తెల్లాపూర్, కొల్లూరు, ఉస్మాన్‌నగర్ వైపు ఎస్‌బీఐ తెల్లాపూర్ మీదుగా వెళ్లే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. నల్లగండ్ల నుంచి ఉస్మాన్‌నగర్, కొల్లూరు వైపు వెళ్లే వాహనదారులు నల్లగండ్ల సర్కిల్-నియో మాల్-గోపన్‌పల్లి ఎక్స్ రోడ్-ఏలియన్స్ జంక్షన్-ఉస్మాన్‌నగర్ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ మీదుగా కొల్లూరు వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అదేవిధంగా తెల్లాపూర్ సర్కిల్ నుంచి ఆర్‌సీ పురం వైపు వెళ్లే వాహనాలు సాయిబాబా టెంపుల్ తెల్లాపూర్-రైల్వే అండర్‌బ్రిడ్జి-ఓల్డ్ ఎంఐజీ-ఆర్‌సీ పురం మార్గాన్ని వినియోగించాలని సూచించారు. కొల్లూరు, ఉస్మాన్‌నగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు కొల్లూరు-ఉస్మాన్‌నగర్-ఏలియన్స్ జంక్షన్-మై హోమ్ సాయుక్-గోపన్‌పల్లి జంక్షన్-గౌలిదొడ్డి-విప్రో సర్కిల్-ఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి చేరుకోవాలని అధికారులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా ఎస్‌బీఐ తెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీ ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. అడ్వైజరీలో ప్రధానంగా 25 రోజుల పాటు ఒక వైపు రహదారి మూసివేత ఉంటుందని పేర్కొన్నారు.





