శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా. మాధవరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధినేత ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పార్టీ వేదికగా బలంగా వినిపిస్తూ, ప్రజలకు–పార్టీ నాయకత్వానికి మధ్య వారధిగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు రవీందర్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వానికి డా. మాధవరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై జనసేన అధికారిక వైఖరిని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తూ, బాధ్యతాయుతమైన రాజకీయ సంభాషణకు, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసానికి ఈ నియామకం ప్రతీకగా భావిస్తున్నానని, రాష్ట్ర నాయకత్వం, పార్టీ శ్రేణులు, జనసైనికుల సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తానని డా. మాధవరెడ్డి తెలిపారు. ఆయన ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌గా కూడా కొనసాగుతున్నారు.





