శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్టన్ పార్క్ విల్లాస్లో రాగం సుజాత యాదవ్ దశదినకర్మ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొని రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాగం సుజాత యాదవ్ మృతి మహిళా లోకానికి, బీసీ సమాజానికి తీరని లోటని అన్నారు. ఎంతో చురుకుగా, చాకచక్యంగా పనిచేసే ఆమె చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. బీసీ సమాజం ఒక మంచి నాయకురాలిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. రాగం సుజాత యాదవ్ ఎంతో ప్రతిభ కలిగిన ప్రజాసేవకురాలని, బీసీ మహిళలకు ఆదర్శప్రాయురాలని అన్నారు. కొందరు వ్యక్తులు మరణించినా తమ సేవలు, ఆలోచనలు, స్ఫూర్తి ద్వారా ప్రజల మధ్య ఎప్పటికీ జీవిస్తారని, అలాంటి వ్యక్తుల్లో రాగం సుజాత యాదవ్ ఒకరని పేర్కొన్నారు. ప్రజాసేవలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె, ఇంకా ఎంతో సాధించాల్సిన సమయంలో అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. రాగం సుజాత యాదవ్ సేవలు పొందిన వారు, ఆమెను అభిమానించిన వారు, ఆమె ద్వారా స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఆమె మరణం తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన సతీమణిని కోల్పోవడం తీవ్ర విషాదమని, ఆయన బాధకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయనకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ దశదినకర్మ కార్యక్రమంలో బీసీ యువ నాయకుడు రవీందర్ గౌడ్, బీసీ విద్యార్థి విభాగం నాయకులు మోడీ రాందేవ్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, సందీప్ యాదవ్, రాజు ముదిరాజ్, నవీన్ యాదవ్, బీసీ కులాల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, రజక సంఘం నాయకుడు కృష్ణ, నాయి బ్రాహ్మణ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు సాయిలు, కురుమ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు శ్రీశైలం కురుమతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు, రాగం కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాగం సుజాత యాదవ్కు ఘనంగా నివాళులర్పించారు.





