శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ నల్లపోచమ్మ, భూలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, భక్తులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నల్లపోచమ్మ, భూలక్ష్మి అమ్మవార్లు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రక్షగా నిలవాలని ఆకాంక్షించారు. అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన గ్రామ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయాభివృద్ధి, దైవకార్యానికి తన వంతు సహాయంగా రవికుమార్ యాదవ్ రూ.2 లక్షల విరాళాన్ని అందించారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్‌తో పాటు కిషోర్, రవి యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, కృష్ణ యాదవ్, సోమయ్య యాదవ్, నరేందర్ యాదవ్, బాబు, శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.





