- శేరిలింగంపల్లి జోన్‌లో పర్యటన
శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): బల్దియా నూతన కమిషనర్ ఇలంబర్తి బుధవారం శేరిలింగంపల్లి జోన్‌లో తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా గచ్బిబౌలిలో నూతనంగా నిర్మాణం అవుతున్న శిల్పా లే అవుట్ ఫ్లె ఓవర్ ఫేజ్ 2 పనులను హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్ వరకు పనులను, తొలగించాల్సిన విద్యుత్ స్తంబాలు, విస్తరించాల్సిన రహదారులను పరిశీలించారు. అనంతరం కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ ఫై ఓవర్ నిర్మాణ పనులలో వేగం పెంచాలని సూచించారు.

నిత్యం ట్రాఫిక్‌తో ఉండే కీలక రహదారిపై ఈ పనులు జరుగుతున్నందున జాప్యం చేయవద్దని, గుత్తేదారు త్వరిత గతిన పూర్తి చేసేలా కృషి చేయాలని ఆదేశించారు. రహదారి విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, కేబుళ్ల మార్పులో సంబంధిత శాఖ నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ర్యాంపు నిర్మాణం నిమిత్తం తాత్కాలిక రహదారి నిర్మాణానికి విద్యుత్ కేబుళ్ల మార్పుతో ముడిపడి ఉన్నందున అధికారులు పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. పై వంతెన నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ పురోగతి నమోదయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కూడళ్ల అభివృద్ధి సుందరీకరణ పనులతో పాటు సర్వీసు రహదారుల నిర్మాణ ప్రక్రియను వేగం చేయాలని కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGSPDCL అధికారులు, జోన్ అధికారులు పాల్గొన్నారు.