మసీదుబండలో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం.. రూ.4 కోట్లతో కాలువ నిర్మాణం..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండలో కుడికుంట చెరువు అలుగు నుంచి ప్రభుపాద లేఅవుట్ కాలనీ వరకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ‌ నిర్మాణ పనులను పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. కాలనీలో వరద నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ప్రభుపాద లేఅవుట్ కాలనీలో వరద నీటి కాలువ‌ అవుట్‌లెట్ సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో నీరు చేరి కాలనీ ముంపునకు గురవుతోందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సుమారు రూ.4 కోట్లతో వరద నీటి కాల్వ నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వరద నీటి కాలువ‌ నిర్మాణానికి పక్కా ప్రణాళిక రూపొందించి, అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. కుడికుంట చెరువు అవుట్‌లెట్ నుంచి అధిక మొత్తంలో వరద నీరు ప్రవహించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువ‌ నిర్మాణం చేపట్టాలని గాంధీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ వరద ముంపు సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువ‌ నిర్మాణ పనులను నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి, సుఖవంతమైన ప్రయాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని గాంధీ పునరుద్ఘాటించారు. శేరిలింగంపల్లి డివిజన్‌తో పాటు మొత్తం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here