శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజున పద్మశ్రీ పురస్కార గ్రహీత, తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన విద్వాంసురాలు డాక్టర్ శోభారాజు, తన శిష్యులతో కలిసి భక్తి సంకీర్తనలను ఆలపించి భక్తులను అలరించారు. తిరుమల ఆస్థాన మండపంలో జరిగిన ఈ గాన కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. శోభారాజు శిష్యులు సందీప్, అభిరామ్, మానస్ పటేల్, జయశ్రీ, శ్రియ, తేజస్విని, సువర్ణ, అక్షయ తమ గాత్రంతో పలు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. గణరాజ, గుణరాజ, విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, కంటి అఖిలాండకోటి, గోవిందాశ్రిత గోకుల బృందా, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వంటి కీర్తనలను భక్తిభావంతో గానం చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పే అన్నమయ్య సంకీర్తనలతో ఆస్థాన మండపం భక్తిరసంతో పరవశించింది. ఈ కార్యక్రమానికి కీబోర్డుపై కళ్యాణ్, తబలాపై పాండు వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు డాక్టర్ శోభారాజుతో పాటు ఆమె శిష్యులను సత్కరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది.





