శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్టుమెంటుకు చెందిన ఆచార్య రావుల కృష్ణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శి, విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.
ఆజాద్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అని అన్నారు. స్వాతంత్రోద్యమంలో పది సంవత్సరాల కారాగార శిక్షను అనుభవించిన స్వాతంత్య్ర సమరయోధుడని, ఆజాద్ పండితుడు, కవి, సంపాదకుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని అన్నారు.నేటి విద్యార్థులు అంతర్జాలానికి ఆకర్షితులై వారి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అవసరమైనంత వరకే అంతర్జాలాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటూ నిత్య వ్యాయామం, ధ్యానం ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకొని అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశాభివృద్ధికి పాటు పడటంతోపాటు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయరాలు P.అనురాధ, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, పాలం శ్రీను, జిల్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.