శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ సందర్భంగా అంజయ్య నగర్ లో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలే నిజాం నిరంకుశ సర్కారుపై గేరెల్లా యుద్ధం ప్రకటించి ,నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం సాగిస్తూ. కొడవళ్ళు, గొడ్డళ్లు, కారం పొడినే అస్త్రాలుగా వాడి నిజాం పాలకులను, రజాకార్లను తరిమి తరిమి కొట్టి, భారత్ యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేసేలా నిజాం నవాబ్ గుండెల్లో దడ పుట్టించారని అన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ఉజ్వల ఘట్టమని తెలుపుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమకారులను అణచివేస్తూ, వందలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న సందర్భంలో అప్పటి భారత హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్యకు ఆదేశించి రజాకార్ల ఆగడాలను అరికట్టారని తెలుపుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 13 నెలల 2 రోజులకు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారని అన్నారు. ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాదులో నిజాం పాలనకు స్వస్తి పలికారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, శివ సింగ్, మాన్యంకొండ, ఆత్మారావు, వరలక్ష్మి, పద్మ, రేఖ, సరోజ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.