మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): సమాజంలో పేద, అనాథ పిల్లలను దగ్గరకు చేర్చుకొని, వారికి చదువు చెబుతూ, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడమనేది నిస్వార్థంగా సమాజానికి సేవ చేయడమేనని హెచ్‌సీయూ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ, గోకుల్ ఫ్లాట్స్ ప్రాంగణంలో వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి సావిత్రిబాయి పూలే పురస్కారాలను ప్రదానం చేశారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాలను ప్రదానం చేసి మాట్లాడారు.
సావిత్రిబాయి జీవితాన్ని వివరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయినిగా ఆమె ఎంతోమందికి నిస్వార్థంగా చదువు చెప్పారని, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని నిర్వాహకురాలు చావా అరుణ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ విద్య మనిషిని సమాజంలో సమున్నత స్ధాయిలో నిలుపుతుందని, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయినిగా సావిత్రిబాయి పూలే తన జీవితాంతం సమాజం కోసమే కృషి చేశారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా పేద, అనాథ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న జి.దుర్గాప్రియ, సి.కళ్యాణి, బి.పద్మావతి, జి.సునీత, ఎం.ఎస్.శ్రీనివాసరావులకు సావిత్రిబాయి పూలే పురస్కారాలిచ్చి ఘనంగా సత్కరించారు. డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నిర్వాహకురాలు చావా అరుణ మాట్లాడుతూ మురికి వాడలు, మహానగరాల్లో అనేకమంది పేద, అనాథ పిల్లలకు తగిన ఆదరణ లేక దారితప్పుతున్నారని, అటువంటివారిని గుర్తించి, కొంతమంది సహకారంతో తనవంతు సేవ చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, బి.సుధాకర్, విష్ణు ప్రసాద్, జి.వివేక్ పాల్గొన్నారు.