- కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి మొర పెట్టుకున్న స్థానికులు
- సమస్య పరిష్కరిస్తానని హామీ
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రాంగూడలో రహదారికి ఇరువైపులా కొందరు నిర్మించిన షటర్లను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సోమవారం జేసీబీలతో కూల్చివేశారు. కాగా తమకు ముందస్తు సమాచారం లేకుండా షటర్లను కూల్చివేశారని, జీవనోపాధి నిమిత్తం షటర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెబుతూ స్థానికులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

షటర్లను కూల్చివేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి రమేష్‌తో కార్పొరేటర్ మాట్లాడారు. ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణాలను ఎలా తొలగిస్తారని కార్పొరేటర్ ఆయనను ప్రశ్నించారు. తనకు ఉన్నతాధికారులు చెప్పడంతోనే కూల్చివేతలు చేపట్టానని రమేష్ వివరణ ఇచ్చారు. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేటర్ స్థానికులకు హామీ ఇచ్చారు.







