శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ మృతి పట్ల ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రఘువీర రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాగం సుజాత యాదవ్ స్వర్గస్తులయ్యారని తెలిసిన వెంటనే రఘువీర రెడ్డి నల్లగండ్లలోని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ రాగం నాగేందర్ యాదవ్‌తోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా రఘువీర రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు రాగం సుజాత యాదవ్ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. సామాజిక సేవా రంగంలో ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని, ఆమె మృతి సమాజానికి, సామాజిక రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు రాగం సుజాత యాదవ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని రఘువీర రెడ్డి ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





