చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మకుంట చెరువు వద్ద హఫీజ్‌పేట్ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సాయుధ పోరాట ధీరవనితగా, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన నిప్పుకణికగా, రజాకార్లను ఎదిరించిన ధిక్కార పతాకంగా ఐలమ్మ చూపిన తెగువ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన ఆమె తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించారని గాంధీ పేర్కొన్నారు. తొలి భూ పోరాటాలకు నాంది పలికిన వీరమాతగా, సామాజిక మార్పుకు మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి, ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని గాంధీ అన్నారు. అణిచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాలను కొనసాగించాలని, ఆమె చూపిన బాటలో ముందుకు సాగాలని గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, రజక సంఘం అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here