చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వివేకానందనగర్‌లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రజక సంఘం కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని దశదిశలా చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. సాయుధ పోరాట ధీరవనితగా, భూస్వాములపై ఎగసిపడిన నిప్పుకణికగా, రజాకార్లను తరిమికొట్టిన ధిక్కార పతాకగా ఆమె చూపిన తెగువ ఎంతోమందికి ఆదర్శమని పేర్కొన్నారు.

చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన ఆమె తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించారని గాంధీ తెలిపారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాతగా, సామాజిక పరిణామాలకు మార్గదర్శకంగా నిలిచిన ధైర్యశాలిగా ఆమెను అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి, ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని గాంధీ అన్నారు. అణిచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం అసమానమైనదని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. చాకలి ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఆశయాలను కొనసాగించాలని, ఆమె చూపిన బాటలో ముందుకు సాగాలని గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అసోసియేషన్ సభ్యులు, రజక సోదరులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here