కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బడుగు, బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ఉద్యమకారుడు, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకల‌ను ఆల్విన్‌ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మబండలో జరిగిన ఈ కార్యక్రమంలో PAC చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌తో కలిసి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు. 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనే కీలక పాత్ర పోషించిన బాపూజీ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యజించిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. భారత స్వాతంత్ర్య పోరాటం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం.. ఇలా మూడు దశల్లోనూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని గాంధీ పేర్కొన్నారు. దేశసేవకు అంకితమైన ఆయన.. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన దృశ్యాన్ని చూడలేకపోయారని అన్నారు. ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా కూడా నిరంతరం ప్రజాసేవకు కృషి చేసిన గొప్ప దార్శనికుడు బాపూజీ అని గాంధీ తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన సొంత ఇంటిని సైతం త్యాగం చేసిన మహనీయుడిగా ఆయన సేవలను గుర్తు చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాతగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు దిక్సూచిగా నిలిచిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని గాంధీ అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, ప్రజాసేవా నిబద్ధత భావితరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి యువత బాపూజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here