శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల కోసం సాగిన పోరాటం ఫలించింది. రేగులకుంటలోని సర్వే నంబర్ 151లో ఉన్న సర్కారీ శిఖం భూమి కబ్జాకు సంబంధించి 9 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్ (SHO)కు ఫిర్యాదు చేశారు. సర్కారీ భూమి కబ్జాకు సంబంధించిన అంశంపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూమి రికార్డులు, కబ్జాకు సంబంధించిన అంశాలను పరిశీలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడితే సర్వే నంబర్ 151కు సంబంధించిన భూమి పరిస్థితి, కబ్జా ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






