కరీంనగర్‌లో యాదవ భవన్‌కు రూ.50 లక్షలు మంజూరు చేయాలి: రఘునాథ్ యాదవ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కరీంనగర్ జిల్లాలోని గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ, కురుమ వర్గాల సంక్షేమం, పశుపోషకుల సమస్యలు, విద్యాభివృద్ధిపై ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లాలో కొత్తగా యాదవ భవన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను రఘునాథ్ యాదవ్ కోరారు.

గొర్రెలు, మేకలు ప్రమాదాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందడం వల్ల పశుపోషకులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. పశుపోషకులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు గొర్రెలు, మేకలకు బీమా సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అందించబోయే బీమా పథకాన్ని యాదవ, కురుమ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యాదవ సమాజం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రఘునాథ్ యాదవ్ పిలుపునిచ్చారు. విద్యనే మనిషికి, సమాజానికి అన్నిటికంటే గొప్ప ఆస్తి అని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక, క్రీడ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, లైవ్‌స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్ సరిత, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ గోట్ అండ్ షీప్ చైర్మన్ మల్లేశం యాదవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ కురుమతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యాదవ, కురుమ ప్రముఖులు, నాయకులు, గొర్రెలు, మేకల పెంపకదారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here