- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో CONCERN INDIA FOUNDATION ఆధ్వర్యంలో తన సొంత నిధులు రూ.20.50 లక్షలతో ఏర్పాటు చేయించిన నూతన ఆంబులెన్స్‌ను బుధవారం ఆయన జిల్లా వైద్య అధికారిణి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా కరోనా వ్యాధిగ్రస్తుల సహాయార్థం తన సొంత నిధులతో ఈ ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 30 బెడ్ల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం సొంత నిధులతో ఆంబులెన్స్‌లను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అందించే సౌకర్యాలను వినియోగించుకోవాలని అన్నారు. ఆంబులెన్స్‌లో ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి సదుపాయాలు ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్, RMOలు డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ EE రవీందర్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు , డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, మారబోయిన రాజు యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్,హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు బలరాం యాదవ్, ఆకుల తిరుపతి, స్థానికులు పాల్గొన్నారు.






