శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పరిధిలోని కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మున్సిపల్ కమీషనర్ సృజన, జోనల్ కమీషనర్ హేమంత్ బోర్కడే, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివిధ కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వృథాను అరికట్టాలని అధికారలు కోరారు. ప్రతి ఇంట్లో, కాలనీ ఖాళీ ప్రదేశాలలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు (Rain Water Harvesting Pits) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుందని, భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదని వివరించారు. కాలనీలలోని పార్కులను సుందరీకరించడంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులలో వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆటస్థలాలు, సరైన లైటింగ్ వ్యవస్థ ఉండేలా చూడాలని కాలనీ అసోసియేషన్లకు సూచించారు. చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా, తడి-పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. కాలనీలను జీరో వేస్ట్ జోన్లుగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA) క్రియాశీలక పాత్ర పోషించాలని, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని కమీషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, సర్కిల్ స్థాయి అధికారులు, వివిధ కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.






