- ఆరవ రోజు వైభవంగా ముగిసిన శివోత్సవములు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీ శంకరాలయ 21 వ వార్షిక శివోత్సవములు ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి అచార్యుల బృందం పర్యవేక్షణలో శనివారం ముగింపు పూజలు నిర్వహించారు. ప్రధానంగా శ్రీ భవానీ అమ్మ వారికి పంచామృత అభిషేకం, 18 రకముల పుష్పాలతో విశేష పుష్పయాగం నిర్వహించారు.

స్థానిక భక్తులు బావరాజు మణికంఠన్ పుష్పాలంకరణ, ఎన్ అశోక్‌కుమార్ శేషవాహన సేవలో భాగస్వాములవ్వగా పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భవానీ శంకరులను దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం శేషవాహనంపై శ్రీ భవానీ శంకరులు చందానగర్ పురవీధుల్లో ఊరేగారు. దారిపొడవునా భక్తులు స్వాగతం పలుకుతు స్వామివార్లను దర్శించుకున్నారు. శివోత్సవాల విజయవంతానికి కృషి చేసిన ఆలయ అర్చక బృందం, సేవాకార్యక్రమాలలో భాగస్వామ్యమైన భక్తులు దాతలుసేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులను ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






