శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) MCPI(U) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను ఎం రమేష్ అధ్యక్షతన మియాపూర్ లోని తాండ్ర రామచంద్రయ్య భవన్ లో నిర్వహించారు. తొలుత రాష్ట్ర కమిటీ సమావేశం ఇటీవల వృద్ధాప్యం అనారోగ్యంతో మరణించిన సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, యంసిపిఐ(యు) నాయకుడు మొద్దు సదానందం, ఆకారపు మల్లయ్యలకు ఘనంగా నివాళులు అర్పించింది. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజా సమస్యలను ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 130కి సవరణ తీసుకువచ్చారని అన్నారు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు అండగా క్షేత్రస్థాయిలో ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన భారత పౌరుల ఓటు హక్కును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను మాత్రమే లిస్టుల్లో ఉంచి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తొలగించి అడ్డదారిన తమ అధికార ప్రాబల్యాన్ని నియంతృత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 420 హామీలను అమలు చేస్తామని ఆశ కల్పించి కేవలం కొన్ని హామీలను మాత్రమే అరకొరగా అమలు చేసి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికార పబ్బం గడుపుతున్నదని ధ్వజమెత్తారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లపు ఉపేందర్, గోనె కుమారస్వామి, వరికుప్పల వెంకన్న, వనం సుధాకర్, వి. తుకారాం నాయక్, ఎన్ రెడ్డి, హంసారెడ్డి, పెద్దారపు రమేష్, మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, తుడుం అనిల్ కుమార్, నాగెళ్లి కొమురయ్య, కంచ వెంకన్న, కర్ర రాజిరెడ్డి, వంగల రాధసుధ, తాండ్ర కళావతి, కుసుంభ బాబూరావు, అంగడి పుష్ప , గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి, పల్లె మురళి, పి.భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.





